వరుస సెలవులు, సమ్మె నేపథ్యంలో కేంద్రం, ఆర్బీఐ కీలక నిర్ణయం
న్యూ ఢిల్లీ: వినియోగదారుల సౌలభ్యం దృష్ట్యా ఈ నెల 27, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతి మంజూరు చేసింది.బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక సెప్టెంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీనికి ముందు సెప్టెంబరు 26, 27 వారాంతపు సెలవులు కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించే పరిస్థితి ఏర్పడింది.
సుదీర్ఘ విరామం వల్ల ఖాతాదారులకు తీవ్ర ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.కేంద్రం సూచనల మేరకు సెప్టెంబరు 27న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఏటీఎం అనుసంధాన విభాగాలు, కరెన్సీ చెస్ట్‌లు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి.
ఖాతాదారుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని తెలిపిన కేంద్రం.. ప్రతిపాదిత సమ్మెను విరమించుకోవాలని బ్యాంకు యూనియన్లకు విజ్ఞప్తి చేసింది. అత్యవసర బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసింది.
