Home/State/ఎమ్మెల్యేలను అడ్డుకుంటారా? పోలీసుల తీరుపై ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం
ఎమ్మెల్యేలను అడ్డుకుంటారా? పోలీసుల తీరుపై ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం

State

ఎమ్మెల్యేలను అడ్డుకుంటారా? పోలీసుల తీరుపై ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం

By Shekar9 hr

రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ, సీపీలకు ఆదేశం

కమిషన్‌ చైర్మన్‌తో సీపీ సజ్జనార్ భేటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (న్యూస్ డెక్):  అసెంబ్లీ వెళ్తున్న  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని దురుసుగా ప్రవర్తించిన ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి రేపటిలోగా నివేదిక సమర్పించాలని డీజీపీ, స్థానిక సీపీలను కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య ఆదేశించారు.

ఈ ఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని గతంలో కోరినా అధికారుల నుంచి స్పందన రాలేదు. దీంతో డీజీపీ ఆదేశాల మేరకు ప్రస్తుత సీపీ సజ్జనార్‌ కమిషన్‌ కార్యాలయానికి విచ్చేసి చైర్మన్‌ బక్కి వెంకటయ్యతో మంతనాలు జరిపారు. రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తించేందుకు వెళ్తున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవడంపై చైర్మన్‌ ఈ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు చట్టపరిధిలో, గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ ఘటనకు సంబంధించి వీడియోలు, పోలీసు రికార్డులు, వాంగ్మూలాలను నిశితంగా పరిశీలించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని చైర్మన్‌తో పాటు కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్‌ అధికారులకు స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, వాస్తవాలు వెలుగులోకి రావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, పీవో యాక్ట్ మెంబర్ బిట్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.