కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఇదో గుణపాఠం
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బీజేపీదే విజయం
న్యూ ఢిల్లీ: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల అవకాశవాద రాజకీయాలకు చెంపపెట్టు అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం న్యూఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన సుప్రీం తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే సంస్కృతికి ఈ రెండు పార్టీలే ఆజ్యం పోశాయని ఆయన విమర్శించారు. నిన్నటి బీఆర్ఎస్ బాటలోనే నేటి కాంగ్రెస్ నడుస్తోందని, బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం నాగేందర్‌ను చేర్చుకుని ఏకంగా ఎంపీగా పోటీ చేయించడం వారి ద్వంద్వ వైఖరికి, రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైందని, రాబోయే ఎన్నికల్లో ఫిరాయింపుదారులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని, ఈ కుళ్లు రాజకీయాలను తరిమికొట్టి ఖైరతాబాద్‌లో బీజేపీకి బ్రహ్మరథం పట్టడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు
