ఎన్టీఆర్ జిల్లాలో నూరు శాతం గెలుపే లక్ష్యం
సమన్వయ కమిటీ భేటీలో నేతల పిలుపు
విజయవాడ, సెప్టెంబర్ 26 (న్యూస్ డెక్): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నూరు శాతం విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. విజయవాడలోని డీవీ మేనర్ హోటల్‌లో శనివారం తెదేపా, జనసేన, భాజపా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

గత రెండున్నరేళ్ల కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గ్రామం, వార్డు స్థాయికి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా మూడు పార్టీల కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో సాగాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా రాజకీయ సమీకరణాలను సమీక్షించుకుని, క్షేత్రస్థాయి సమస్యలను పరస్పర చర్చలతో పరిష్కరించుకుంటూ ఎన్నికల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), పార్లమెంటరీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ మక్కెన మల్లికార్జునరావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), భాజపా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన నేతలు అమ్మిశెట్టి వాసు, బొలిశెట్టి శ్రీకాంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.


