సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అనారోగ్యంతో చెన్నయ్‌లో తుది శ్వాస విడిచారు.ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో కన్నుమూశారు.వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన చివరిసారిగా దర్శకత్వం వహించిన 'సింగ్ గీతం' చిత్రం ఇటీవలే విడుదలైంది.ఈ సినిమాను నాగ అశ్విన్ నిర్మించారు.94 సంవత్సరాల వయసులో దర్శకత్వం వహించిన తొలి భారతీయ దర్శకుడిగా ఆయన రికార్డ్ సృష్టించారు.
1932లో మొదటి తెలుగు సినిమా పుట్టింది.దానికి ఒక సంవత్సరం ముందు సెప్టెంబర్ 21వ తేదీన సింగీతం శ్రీనివాసరావు జన్మించారు.నాటక రంగంలో తొలుత అరంగేట్రం సాగించి,చిత్రసీమలో స్థిరమైన-ఉన్నతమైన దర్శక స్థానాన్ని పొందిన వ్యక్తి శ్రీనివాసరావు.
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సింగీతం శ్రీనివాసరావును నిజమైన దార్శనికుడిగా అభివర్ణిస్తూ ఆయనతో తన అనుబంధాన్ని,సినీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు చిరంజీవి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.వయసు పెరిగినా మనసులో మాత్రం సింగీతం ఎప్పుడూ యువకుడిగానే ఉండేవారని చిరంజీవి గుర్తుచేశారు.కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి,కొత్తగా ఏదైనా సృష్టించాలనే తపన సింగీతం శ్రీనివాసరావులో చివరి వరకు కొనసాగాయని చిరంజీవి అన్నారు.అలాంటి సృజనాత్మక దార్శనికుడిని కోల్పోవడం తెలుగు,భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.సింగీతం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలిపారు.సింగీతం గారిని తామంతా మిస్ అవుతామని,అయితే ఆయన తెరకెక్కించిన సినిమాలు తరతరాల ప్రేక్షకులతో ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాయని అన్నారు.చివరగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ‘ఓం శాంతి’ అంటూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
భారతీయ చలన చిత్ర పరిశ్రమకు సింగీతం శ్రీనివాసరావు విభిన్నమైన చిత్రాలను అందించారని పవన్ కల్యాణ్ అన్నారు.‘పుష్పక విమానం’,‘విచిత్ర సోదరులు’,‘మయూరి’,‘ఆదిత్య 369’,‘మైకేల్ మదన కామరాజు’ వంటి చిత్రాల్లో ఆయన చేసిన ప్రయోగాలు,చూపిన సృజనాత్మకత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.అలాగే ‘అమెరికా అమ్మాయి’,‘పంతులమ్మ’ వంటి చిత్రాల్లోని గీతాలు కూడా విశేష ప్రజాదరణ పొందాయని పవన్ కల్యాణ్ తెలిపారు.94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా ఆయనకు సినిమాపై ఉన్న అంకితభావం,ఆసక్తి స్పష్టమవుతాయని అన్నారు.సింగీతం శ్రీనివాసరావు మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ.ఆయన కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

