మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
హాజరైన మంత్రులు, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన ఎన్నికల సంఘం కార్యాలయం వరకు కొనసాగింది. కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిని నిరసిస్తూ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్న సీఈసీ తన పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని మండిపడ్డారు. ఈ నిరసనకు కాంగ్రెస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. భద్రతా దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు.



