దేశంలోనే తొలిసారిగా పురస్కారం దక్కించుకున్న రాష్ట్ర సంస్థ
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 26 (న్యూస్ డెక్): గ్రామాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ‘సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ’ (SSAAT) సంస్థ జాతీయ స్థాయి ‘స్కోచ్ గోల్డ్’ (SKOCH Gold) పురస్కారాన్ని దక్కించుకుంది. దేశంలో ఒక రాష్ట్ర సోషల్ ఆడిట్ విభాగానికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. దిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో జరిగిన 109వ ‘స్కోచ్’ సదస్సులో ఏపీ సోషల్ ఆడిట్ డైరెక్టర్ జి.శ్రీకాంత్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశంలో సామాజిక తనిఖీ వ్యవస్థను ప్రభుత్వం పటిష్ఠపరిచింది. గ్రామసభలు, ప్రజావేదికల ప్రత్యక్ష ప్రసారాలు, నివేదికల డిజిటలైజేషన్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచింది. ఏటా దాదాపు 13,396 తనిఖీలను నిర్వహిస్తూ, 2024-25లో 8.9 లక్షలు, 2025-26లో 9.18 లక్షల పనులపై ఆడిట్ పూర్తి చేశారు. అంతేకాకుండా 43.4 లక్షల ఉపాధి హామీ శ్రామిక కుటుంబాలను నేరుగా కలిసి అభిప్రాయాలు, సమస్యలను సేకరించారు.
రాష్ట్రంలో అమలవుతున్న ఈ వినూత్న విధానాలను అధ్యయనం చేసేందుకు ఇప్పటికే 22 రాష్ట్రాల ప్రతినిధులు గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషి, ప్రజల భాగస్వామ్యం వల్లే ఈ అరుదైన గుర్తింపు సాధ్యమైందని డైరెక్టర్ జి.శ్రీకాంత్ పేర్కొన్నారు.




