అక్టోబరు 13 నుంచి 15 వరకు హైదరాబాద్ లో సదస్సు
బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ హాజరు

ముంబయి(న్యూస్ డెక్): పారిశ్రామిక రంగంలో యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్టోబరు 13 నుంచి 15 వరకు హైదరాబాద్ వేదికగా ‘సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ మీట్’ను నిర్వహించనున్నట్లు ‘సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్’ ప్రకటించింది. బృహస్పతి గ్రూప్ ఆధ్వర్యంలో ముంబయిలోని ఔరికా హోటల్‌లో నిర్వహించిన సన్నాహక సదస్సులో ఈ సదస్సు అధికారిక పోస్టర్‌ను ప్రముఖులు ఆవిష్కరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. సంప్రదాయ వ్యాపారాలతో పాటు కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి భవిష్యత్ సాంకేతికతల్లో యువత రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. స్టార్టప్ ఇండియా, ముద్ర రుణాల వంటి పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తోందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌రావ్ నాయక్ మాట్లాడుతూ.. దేశ పారిశ్రామిక ప్రగతిలో భాగస్వామ్యం ఎంతో కీలకమని, తమ రాష్ట్ర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వర్గాల సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్ మహాసదస్సుకు సన్నాహకంగా దిల్లీ, బెంగళూరు, చెన్నైలలోనూ ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.




