MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి?

State

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి?

By Shekar1 hr

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి? అర్హతలు ఏంటి?

Telangana Graduate MLC Elections: తెలంగాణలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కొత్త ఓటర్ల నమోదు సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమైంది. గతంలో ఓటరుగా నమోదైన వారైనా లేదా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారైనా తప్పనిసరిగా ఫారమ్-18 ద్వారా అప్లై చేయాలి.

తెలంగాణలోని రెండు ప్రధాన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కొత్త ఓటర్ల జాబితా సేకరణను ఎన్నికల కమిషన్ అధికారికంగా స్టార్ట్ చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ తో పాటు వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే గ్రాడ్యుయేట్లు వెంటనే తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.తెలంగాణ ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ (https://ceotelangana.nic.in) ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ఫారాన్ని సమర్పించవచ్చు.

ఓటరుగా నమోదుకు అర్హతలు ఏంటి?

• డిగ్రీ విద్యార్హత: భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదేనీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలి.

• 3 ఏళ్ల గడువు: 2026 నవంబర్ 1ని కట్ ఆఫ్ డేట్‌గా నిర్ణయించారు. అంటే, 2023 నవంబర్ 1 లేదా అంతకంటే ముందే డిగ్రీ పాస్ అయి ఉండాలి.

• స్థానిక నివాసం: దరఖాస్తు చేసే నియోజకవర్గ పరిధిలో సాధారణ నివాసిగా నివసిస్తూ ఉండాలి. అంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మీరు ఉదాహరణకు హైదరాబాద్ లేదా ఖమ్మం పరిధిలో నివాసం ఉండాలి.

• పౌరసత్వం: భారతీయ పౌరుడై ఉండాలి.

చివరి తేదీ: ఓటర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 6 వరకు గడువు ఇవ్వబడింది.