ఐపీసీ లెఫ్టినెంట్ జనరల్‌గా తొలి భారతీయ మహిళ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత మహిళా శక్తి మరోసారి సత్తా చాటింది. ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ పోలీస్ కమిషన్ – గ్లోబల్ కమాండ్ ఇంటర్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (IPC GC IGO) ఆమెను ‘సౌత్ ఏషియా కమాండర్’గా నియమించింది. సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పీస్‌కీపింగ్ ఆపరేషన్స్ పరిధిలో పారామిలిటరీ హోదా కలిగిన 'లెఫ్టినెంట్ జనరల్' బాధ్యతలను ఆమెకు అప్పగించింది. ఈ హోదాను దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు.

ప్రపంచ శాంతి, అంతర్జాతీయ చట్టాల అమలు, ప్రజా భద్రత, మానవతా దృక్పథంతో కూడిన సామాజిక సేవల విస్తరణే లక్ష్యంగా ఐపీసీ జీసీ ఐజీవో పనిచేస్తోంది. సంస్థ సుప్రీమ్ కమాండింగ్ జనరల్ రాబర్ట్ ఎస్. బియాజోన్ నేతృత్వంలోని గ్లోబల్ సుప్రీమ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డా. సుప్రియా నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. దక్షిణాసియా ప్రాంతంలో శాంతి స్థాపన, విపత్తు సహాయక చర్యలు, సామాజిక సాధికారత తదితర కార్యక్రమాలకు ఆమె నాయకత్వం వహించనున్నారు.
ఫిలిప్పీన్స్‌లో ఉన్నత స్థాయి భేటీలు
ఈ నియామకం అనంతరం సెప్టెంబరు 19 నుంచి 25 వరకు డాక్టర్ సుప్రియా ఫిలిప్పీన్స్‌లో అధికారిక పర్యటన చేపట్టారు. అక్కడ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుల్లో సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గ్లైజా జేడ్ సి. పెనెడా, గ్లోబల్ ప్రొటెక్షన్ విభాగ డైరెక్టర్ బ్రయాన్ అల్ఫోన్సోతో పాటు ఫిలిప్పీన్ కమాండ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అలాగే దక్షిణ కొరియా, బంగ్లాదేశ్, అమెరికా తదితర దేశాల ఐపీసీ కమాండర్లతో ప్రత్యేకంగా భేటీ అయి, దక్షిణాసియాలో చేపట్టాల్సిన మానవతా సేవా ప్రాజెక్టులు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలపై చర్చించారు. అంతర్జాతీయ సంస్థాగత నాయకత్వంలో భారతీయ మహిళకు ఇంతటి కీలక బాధ్యతలు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.






