ఒడిశా గనులు, బెంగాల్ వాణిజ్యంతో విస్తృత అవకాశాలు
కోల్‌కతా: తూర్పు భారత ప్రాంతాన్ని దేశ పారిశ్రామికాభివృద్ధికి కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన ‘అల్యూమినియం రోడ్‌షో’లో పారిశ్రామికవేత్తలు, వ్యాపార రంగ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒడిశాలోని ఖనిజ సంపదను, పశ్చిమబెంగాల్ పారిశ్రామిక, లాజిస్టిక్స్ సామర్థ్యంతో అనుసంధానిస్తే ఈ ప్రాంతం ప్రపంచస్థాయి అల్యూమినియం తయారీ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రక్షణ, రైల్వే, పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ రంగాల్లో అల్యూమినియం ప్రాధాన్యం పెరుగుతోందని, 'నెట్ జీరో 2070' సాధనలోనూ దీని పాత్ర కీలకమన్నారు. కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా అధిక విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. 'అల్యూమినియం విజన్ 2047' ద్వారా దేశీయ ఉత్పత్తిని దాదాపు ఆరు రెట్లు పెంచడంతో పాటు, ప్రపంచ మార్కెట్లో భారత వాటాను 3.8 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
దేశంలో బొగ్గు కొరత లేదు
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో బొగ్గు కొరత లేదని స్పష్టం చేశారు. వర్షాకాలం ప్రభావం తగ్గుముఖం పట్టడంతో గనుల్లో ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకుందని, విద్యుత్ కేంద్రాలు సహా పరిశ్రమలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.






