ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై తప్పుడు ప్రచారాలకు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టీకరణ

State

ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై తప్పుడు ప్రచారాలకు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టీకరణ

By Shekar1 hr

నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా పేరును పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ఎన్నికల బరిలో నిలుస్తున్నాను.

అయితే నా అభ్యర్థిత్వంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టికెట్ అడగలేదు, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, చేతులెత్తేశారు, యూ టర్న్ తీసుకున్నారు అంటూ ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవం.

నేను ఎప్పుడూ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంటానని చెప్పలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం నా స్పష్టమైన నిర్ణయం.

పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో స్వీకరిస్తున్నాను. పట్టభద్రులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ, ప్రభుత్వం మరియు సంబంధిత వేదికల దృష్టికి తీసుకెళ్లడం నా ప్రధాన లక్ష్యం.

నా దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాల గురించి నేను గతంలో చెప్పిన విషయాలను ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలతో ముడిపెట్టి వక్రీకరించడం సరికాదు. ప్రస్తుతం నా ముందున్న బాధ్యత ఒక్కటే — కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి, పట్టభద్రుల సమస్యలకు బలమైన ప్రాతినిధ్యం వహించడం.

ఇక “రెండు సీట్లు రెడ్లకే ఇవ్వడంతో బీసీ వర్గాల్లో ఆగ్రహం వచ్చిందని, అందుకే కాంగ్రెస్ అభ్యర్థిని మార్చబోతోందని” చేస్తున్న ప్రచారానికి కూడా ఎలాంటి ఆధారం లేదు. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఊహాగానాలను ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం.

కాంగ్రెస్ పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎన్నికల బరిలో ఉన్నాను. పట్టభద్రుల ఆశీస్సులతో ముందుకు సాగుతాను.

ప్రచారం చేసేవారు ఏం చెప్పినా, నా వైఖరి స్పష్టమైనది కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పట్టభద్రుల సమస్యల కోసం పోరాడుతాను. ప్రజల తీర్పును గౌరవిస్తానని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రకటించారు.