సీఈసీ రాజీనామా చేయాల్సిందే.. ‘ఇండి’ కూటమి

National

సీఈసీ రాజీనామా చేయాల్సిందే.. ‘ఇండి’ కూటమి

By Shekar07 Oct 2026

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష ‘ఇండి’ కూటమి దేశ రాజధానిలో చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, సీఈసీ వైదొలగాలనే ఏకైక డిమాండ్‌తో విపక్ష ఎంపీలు జంతర్‌మంతర్‌ ముట్టడికి యత్నించారు. అయితే, అనుమతి లేదంటూ వారిని అశోకా రోడ్డు వద్దే దిల్లీ పోలీసులు బలవంతంగా నిలువరించి అదుపులోకి తీసుకున్నారు.

రాజీనామా చేసేవరకూ పోరాటం ఆగదు: రాహుల్‌ గాంధీ

జంతర్‌మంతర్‌ బయలుదేరడానికి ముందు దిల్లీలోని సాగర్ రత్న హోటల్ వేదికగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ సీఈసీపై నేరుగా విరుచుకుపడ్డారు:

‘‘జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని, ఆయన రాజీనామా సమర్పించేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ దేశంలో అత్యంత పవిత్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకే మేం పోరాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మాపై ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయం. నాపై వంద ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా సంతోషమే.. ఆ కేసులను గౌరవప్రదమైన పతకాలుగా భావిస్తాం. ఎన్నికల సంఘం పాల్పడుతున్న అరాచకాలను దేశవ్యాప్తంగా ప్రతి వీధికీ తీసుకెళ్తాం.’’ అని రాహుల్ అన్నారు.

అశోకా రోడ్డుపై ఉద్రిక్తత.. ఎంపీల నిర్బంధం

హోటల్‌ నుంచి మూడు ప్రత్యేక బస్సుల్లో విపక్ష ఎంపీలు జంతర్‌మంతర్‌ వైపు బయలుదేరగా, అశోకా రోడ్డు వద్ద భారీగా మోహరించిన పోలీసులు, కేంద్ర బలగాలు బారికేడ్లతో ఆ కాన్వాయ్‌ను అడ్డగించాయి. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తమకు ఉందంటూ ఎంపీలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

పోలీసులు నాపై దాడి చేశారు: ప్రియాంక గాంధీ ఆగ్రహం

పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా నడిరోడ్డుపై పడుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.‘‘ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని కోరుతున్న పార్లమెంట్ సభ్యుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? పోలీసులు నన్ను కిందపడేసి ఈడ్చుకెళ్లారు. నా చేతులు, శరీరమంతా రక్కేశారు. మహిళా ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. మేం ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు’’ అని ప్రియాంక ధ్వజమెత్తారు. సీఈసీ రాజీనామా కోరుతూ సాగిన ఈ ఆందోళనలతో దిల్లీ నడిబొడ్డున భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎన్నికల సంఘం పారదర్శకతను కోల్పోయిందని, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని విపక్ష కూటమి నేతలు స్పష్టం చేశారు