శివ కేశవులు వేరనటం వెర్రితనమే…

National

శివ కేశవులు వేరనటం వెర్రితనమే…

By Shekar1 hr

సీఎం వాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిప్పులు

దిల్లీ: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 ఉప హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రజల దృష్టి మళ్లించేందుకే దేవుళ్ల మధ్య చిచ్చుపెడుతూ చౌకబారు రాజకీయాలకు ఒడిగడుతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాముడు, శివుడిని వేరుచేస్తూ సనాతన ధర్మాన్ని కించపరిచేలా సీఎం చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను యావత్ సమాజం ఛీత్కరించుకుంటోందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్‌ హిందూ సమాజాన్ని అవహేళన చేసి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, ఇప్పుడు అధిష్ఠానం మెప్పు కోసం రేవంత్‌రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తూ భంగపడక తప్పదని హెచ్చరించారు.

ఓడిన ప్రతిసారీ ఈవీఎంలపై నెపం నెట్టడం కాంగ్రెస్‌కు అలవాటైందని విమర్శించిన కిషన్‌రెడ్డి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ‘ఓట్ చోరీ’ జరిగిందని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. బోగస్ ఓట్ల ఏరివేత కోసమే అధికారులు సమగ్ర ప్రక్రియ చేపడుతుంటే కాంగ్రెస్‌ ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల ఎంపీ స్థానాలను 129 నుంచి 195కు పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గాల పునర్విభజనను దురుద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఆరోపించారు. స్థానిక సింగరేణి బొగ్గు వినియోగానికి అనుగుణంగా యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ బాయిలర్లను ఎందుకు నిర్మించలేదో గత బీఆర్‌ఎస్‌ పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోబోదని, కేటీఆర్‌ పగటికలలు మానుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఖైరతాబాద్‌ ఉపఎన్నిక వస్తే బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా, అక్టోబర్‌ 3, 4 తేదీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని, అక్టోబర్‌ 2 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ‘స్వచ్ఛతా సంకల్ప్‌’లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.