హైదరాబాద్: ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 'మెట్రో - ఆర్టీసీ బస్ కామన్ పాస్' సేవలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు నవీన్ యాదవ్, శ్రీగణేష్ తదితరులు పాల్గొని ఆర్టీసీ బస్సు, మెట్రో రైళ్లలో ప్రయాణించారు.
ప్రజాభవన్ వద్ద ప్రత్యేక ఆర్టీసీ బస్సులో బయలుదేరిన ప్రజాప్రతినిధుల బృందం తొలుత బేగంపేట మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ నూతన కామన్ పాస్‌ను స్వయంగా వినియోగించి టికెటింగ్ వ్యవస్థ పనితీరును పరిశీలించిన అనంతరం, మెట్రో రైలు ఎక్కి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులతో మాట్లాడి కొత్త పాస్ ద్వారా కలుగుతున్న వెసులుబాటు, రవాణా సౌకర్యాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. మెట్రో, ఆర్టీసీలకు ఒకే కామన్ పాస్ అందుబాటులోకి రావడం వల్ల నగరవాసులకు ప్రయాణం మరింత సులభతరం, వేగవంతం అవుతుందన్నారు. సమయం, ఆదాతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని చెబుతూ, ప్రజలంతా ఈ సదుపాయాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.






