స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. విజయవాడ రాజకీయాల్లో బలమైన నేపథ్యం ఉన్న రాధా చేరిక అందరి దృష్టిని ఆకర్షించింది. విజయవాడ మేయర్ పదవికి జనసేన ఆయనను పరిశీలించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, మేయర్ అభ్యర్థుల విషయంలో ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పరిణామాలు కూటమి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అదే సమయంలో, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాసరావు మరియు ఇతర కూటమి నాయకులు సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.





